చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది?: జగన్

  • ఆక్వా ఫీడ్ ధరల పెంపు అంశంపై జగన్ స్పందన 
  • ఫీడ్ కంపెనీలతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కైందంటూ తీవ్ర విమర్శలు
  • ధరలు తక్షణమే పూర్తిగా ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్
  • లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా ఫీడ్ ధరల పెంపు అంశంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కై, కమీషన్ల కోసం ఆక్వా రైతులను దారుణంగా దోచుకుంటోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పెంచిన ధరలను తక్షణమే పూర్తిగా ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని జగన్ హెచ్చరించారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని జగన్ విమర్శించారు. "మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగమూ మినహాయింపు కాదు. చివరకు ఆక్వా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకుంటున్నారు" అని ఆయన ధ్వజమెత్తారు. ఫీడ్ కంపెనీల యాజమాన్యాలు టీడీపీ సానుభూతిపరులని, కమీషన్ల కోసం వారితో చంద్రబాబు లాలూచీ పడ్డారని, అందుకే వారు అడ్డగోలుగా ధరలు పెంచుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉందని ఆరోపించారు.

తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులను సిండికేట్ల నుంచి, దళారుల బారి నుంచి కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, ముఖ్యమంత్రి చైర్మన్‌గా 'ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ' (ఏపీఎస్ఏడీఏ)ని ఏర్పాటు చేశామని జగన్ గుర్తుచేశారు. ఈ సంస్థ ద్వారా సీడ్, ఫీడ్ నాణ్యత, ధరలను నియంత్రించడంతో పాటు, ఆక్వా ఉత్పత్తులకు ప్రభుత్వమే ధర నిర్ణయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీనికితోడు, ఆక్వా రైతులకు యూనిట్ కరెంటును కేవలం రూ.1.50కే అందించి అండగా నిలిచామని పేర్కొన్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్దేశపూర్వకంగానే ఏపీఎస్‌ఏడీఏను నిర్వీర్యం చేసి, తమ ప్రభుత్వ చర్యలన్నింటినీ నీరుగార్చిందని విమర్శించారు.

ఏపీఎస్‌ఏడీఏ అనుమతి లేకుండా కంపెనీలు ధరలు పెంచాయని ప్రభుత్వం ఇప్పుడు చెప్పడం ప్రజల చెవిలో పువ్వులు పెట్టడానికేనని జగన్ ఎద్దేవా చేశారు. "ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీవాళ్లు కాబట్టే కదా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఫీడ్ ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ ప్రభుత్వం మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని హితవు పలికారు. పెంచిన ధరలను పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని, రైతుల పక్షాన వైసీపీ అండగా నిలుస్తుందని జగన్ స్పష్టం చేశారు.

Jagan Mohan Reddy
Aqua feed price hike
Andhra Pradesh
Chandrababu Naidu
TDP
YSRCP
Aqua farmers
AP State Aquaculature Development Authority
APASADA
Feed companies

More Telugu News